హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పిటిషన్
- ధర్మేంద్ర తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదన్న అషు రెడ్డి
- పోలీసులు ఏకపక్షంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆవేదన
- తప్పుడు ప్రచారం చేస్తూ తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారన్న అషు
హనీ ట్రాప్, చీటింగ్ కేసులో సినీ నటి అషు రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆమె క్వాష్ పిటిషన్ వేశారు. లండన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని, తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు.
పోలీసులు కనీసం తన వివరణ తీసుకోకుండానే, కేవలం ధర్మేంద్ర తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏకపక్షంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అషు రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ తన వ్యక్తిత్వ హననం చేస్తున్నారని, వాస్తవాలను దాచిపెట్టి ఈ కేసు పెట్టారని ఆమె అన్నారు.
మరోవైపు, 2018 నుంచి పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. సుమారు రూ. 9.35 కోట్ల డబ్బు, 5 కిలోల బంగారం, విలాసవంతమైన కార్లు, ఫ్లాట్లు వసూలు చేసిందని ధర్మేంద్ర కుటుంబం అషు రెడ్డిపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.